ap-government-education-policies-students-going-to-speak-at-UNO

 ap-government-education-policies-students-going-to-speak-at-UNO

AP Government: ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించనున్న 10మంది ఏపీ విద్యార్థులు

ఏపీ విద్యార్థులు ఐక్యరాజ్య సమితిలో అడుగుపెట్టబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులుగా ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడబోతున్నారు. ఏపీలో జరుగుతున్న విప్లవాత్మక విద్యా విధానాలపై ప్రసంగించబోతున్నారు.

వారంతా పేదవిద్యార్థులే... కానీ విద్యాకుసుమాలు. ప్రభుత్వ పాఠశాల్లో చదువుతున్నా... ఇంగ్లీషులో అద్భుతంగా మాట్లాడగలరు. సీఎం జగన్‌ ముందే ఆంగ్లంలో మాట్లాడి  అదరగొట్టారు. ఆ ప్రతిభే.. వారిని ఐక్యరాజ్య సమితి వరకు తీసుకెళ్తోంది. ప్రభుత్వ ప్రోత్సాహంతో యూఎన్‌వోలో ప్రసంగించే అరుదైన అవకాశాన్ని ఆ విద్యార్థులు సొంతం  చేసుకున్నారు. 

న్యూయార్క్‌లో అంతర్జాతీయస్థాయిలో జరుగుతున్న హైలెవల్ పొలిటికల్ ఫోరంలో... ఆంధ్రప్రదేశ్‎లో జరుగుతున్న విప్లవాత్మక విద్యా విధానాలను తెలియజేయాలని  ఐక్యరాజ్యసమితి కోరింది. అందు కోసం రాష్ట్ర ప్రతినిధుల బృందాన్ని పంపించాలని ఆహ్వానించింది. ఐక్యరాజ్య సమితి ఆహ్వానంపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం... 13జిల్లాల్లో పదో  తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాదించిన 150మందిని ఎంపిక చేసింది. ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు, మారిన బడుల తీరుపై ఆ విద్యార్థులకు పరీక్ష నిర్వహించగా  30 మంది ఉత్తమ ప్రదర్శన కనబరిచారు. వీరికి కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ కార్యదర్శి మధుసూదనరావు, యూఎన్‌వో స్పెషల్‌ కన్సల్టేటివ్‌ స్టేటస్‌ మెంబర్‌ ఉన్నవ  షకిన్‌కుమార్‌ నేతృత్వంలో నలుగురు సభ్యుల బృందం మౌఖిక పరీక్షలు నిర్వహించి... 10 మందిని విజేతలుగా ఎంపిక చేసింది. ఈ 10 మంది విద్యార్థులు ప్రభుత్వ ఖర్చుతో...  సెప్టెంబర్15 నుంచి 27వరకు జరిగే యూఎన్‌వో డెలిబెరేషన్ సభకు వెళ్తారు. ఏపీ నూతన విద్యా సంస్కరణలుపై ప్రసంగిస్తారు. ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతోనూ మాట్లాడతారు.  ఏపీ ప్రభుత్వం అమలుచేస్తున్న విద్యా సంస్కరణలు, పాఠశాలల అభివృద్ధిపై మాట్లాడేందుకు సరైన ప్రతినిధులు విద్యార్థులేనని.. ఎంపికైన వారంతా పేద కుటుంబాల పిల్లలేనని  విద్యాశాఖ అధికారులు తెలిపారు  

ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించేందుకు ఎంపికైన 10 మంది ఏపీ విద్యార్థుల్లో... రైతుకూలి బిడ్డ అమ్మాజాన్, లారీ డ్రైవర్‌ కుమార్తె రాజేశ్వరి, సెక్యూరిటీ గార్డు కూతురు జ్యోత్స్న,  కౌలురైతు కొడుకు అంజన సాయి, రోజుకూలీ బిడ్డ గాయత్రి, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ కుమార్తె శివలింగమ్మ, టీచర్‌ కూతురు మనశ్విని, రైతుబిడ్డ యోగీశ్వర్, మెకానిక్‌  కూతురు రిషితారెడ్డి, ఆటోడ్రైవర్‌ కుమార్తె చంద్రలేఖ ఉన్నారు. రెక్కాడితేగాని డొక్కాడని కుటుంబాలు వీరివి. పేద కుటుంబంలో పుట్టినా... చదువులో చూపిన ప్రతిభ... వీరికి  ఐక్యరాజ్యసమితి వరకు తీసుకెళ్లింది. ఈ విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వమే ఐక్యరాజ్య సమితికి పంపిస్తోందని, వీరికి అవసరమైన పాస్‌పోర్టు, వీసా వంటి అన్ని ఏర్పాట్లు చేసినట్టు  అధికారులు తెలిపారు. ఈ పర్యటనలో విద్యార్థులంతా అమెరికా అధ్యక్ష భవనాన్ని కూడా సందర్శిస్తారని చెప్పారు. ఈ 10 విద్యార్థులను సీఎం జగన్‌ అభినందించారు. తొమ్మిదో తరగతి విద్యార్థిని మనస్విని సీఎం జగన్‌ను కూడా కలిసింది.

10 మంది విద్యార్థుల్లో తొమ్మిదో తరగగి చదువుతున్న సామల మనశ్విని కూడా ఉంది. కురుపాం మండలం కొండబారిడి గిరిజన గ్రామానికి చెందిన మనశ్విని తల్లి కృష్ణవేణి  ప్రభుత్వ టీచర్‌. మనశ్విని ప్రస్తుతం గుమ్మలక్ష్మీపురం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో తొమ్మిదో తరగతి చదువుతోంది. గిరిజన కుగ్రామంలో పుట్టి పెరిగిన  ఈ  చిన్నారి... సీఎం సభలో ఇంగ్లీషులో స్పీచ్‌ ఇచ్చి... అందరినీ ఆకట్టుకుంది. ఏజెన్సీ ప్రాంతం నుంచి ఐక్యరాజ్యసమితికి ఎంపికైన మనస్విని.. అందరూ అభినందిస్తున్నారు.  కురుపాం ఎమ్మెల్యే పి.పుష్పశ్రీవాణి విద్యార్థినిని సత్కరించి... 50వేలు అందించారు.