10th-class-telugu-question-paper-analysis

 10th-class-telugu-question-paper-analysis

తెలుగు పరీక్ష తేలికే

రాష్ట్రవ్యాప్తంగా సోమవారం (18. 3. 2024) నుండి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరిగాయి. మాతృభాష తెలుగుతో  ఆరంభమయ్యే ఈ పరీక్షల్లో ప్రణాళిక బద్ధంగా చదివితే అన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత పొందడంతో పాటుగా అత్యధిక మార్కులు కూడా సంపాదించవచ్చు. అందులో ప్రథమ భాష తెలుగు పరీక్షను ఆత్మవిశ్వాసంతో రాసినట్లయితే అది తర్వాతి పరీక్షకు ప్రేరణ అవుతుందని... తెలుగు పరీక్షలో మంచి మార్కులు సంపాదించడం తేలికవుతుందని తెలుగు పండితులు, అన్నమయ్య జిల్లా పరీక్షల మండలి రచయిత గంగనపల్లి వెంకటరమణ పేర్కొన్నారు. వివరాలు ఆయన మాటల్లోనే...
10TH CLASS TELUGU MODEL PAPERS 2023-24 LATEST 16 MODEL PAPERS (with Answers) PDF CLICK HERE
మొత్తం 100 మార్కులకు జరిగే ప్రథమ భాష తెలుగు పరీక్షలో మూడు విద్యా ప్రమాణాల ద్వారా విద్యార్థుల సామర్ధ్యాలను మదింపు చేస్తారు. అందులో  
1. అవగాహన - ప్రతిస్పందన (32 మార్కులు)
2. వ్యక్తీకరణ - సృజనాత్మకత (36మార్కులు)
3. భాషాంశాలు (32మార్కులు) ఉంటాయి.
మొదటి విద్యా ప్రమాణమైన అవగాహన - ప్రతిస్పందనలో 4 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కొక్కదానికి 8 మార్కులు.  మొత్తం 32 మార్కులు.
 ఇందులో 1వ ప్రశ్న పరిచిత పద్యాలకు సంబంధించిన ప్రశ్న. ఏవేని రెండు పద్య పాఠ్యాంశాల నుండి రెండు పద్యాలను ఇచ్చి ఒకదానికి అడిగిన విధంగా 4 ప్రశ్నలకు సమాధానాలు రాయమంటారు. దీనికోసం సముద్రలంఘనం, భిక్ష పాఠాలలోని ఆటవెలది, తేటగీతి, కంద పద్యాలను విద్యార్థులు తర్ఫీదు పొందితే ఒకటి రాయవచ్చు. ఒక్కో సమాధానానికి రెండు మార్కుల చొప్పున ఉంటాయి కాబట్టి కేవలం ఒక పదంతోనో, పదబంధంతోనో కాకుండా పూర్తి వాక్యంలో సమాధానాలు రాయాలి.
విద్యార్థులకు సూచన : 
సీస పద్యానికి అనుబంధంగా ఉన్న ఆటవెలది, తేటగీతి పద్యాలను పబ్లిక్ పరీక్షలలో అడగరు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి తర్ఫీదు పొందాలి.
2వ ప్రశ్న పరిచిత గద్యానికి చెందినది. ఇందుకోసం గద్య పాఠ్యాంశాలను విద్యార్థులు చదివి అవగాహన చేసుకున్నట్లయితే అడిగిన ప్రశ్నలకు సమాధానాలను తేలికగా రాయవచ్చు. అయితే సమాధానాలు పూర్తి వాక్యంలో రాయాలి.
విద్యార్థులకు సూచన : 
పరిచిత పద్య, గద్యాలలో ఒక ప్రశ్న తయారు చేయమని అడుగుతారు. అప్పుడు "ఈ పద్యాన్ని రచించిన కవి ఎవరు ? ఈ పద్యం ఏ పాఠం లోనిది ? అని, పై గద్యాన్ని రచించినది ఎవరు ? పై గద్యం ఏ పాఠం లోనిది ? " వంటి ప్రశ్నలను తయారు చేయవచ్చు. ఇవే కాకుండా పేరాలోని విషయాన్ని అనుసరించి కూడా విద్యార్థులు ప్రశ్నలు తయారు చేయవచ్చు.
3వ ప్రశ్నగా రామాయణం నుండి అడిగిన నాలుగు వాక్యాలను క్షుణ్ణంగా చదివి, అవగాహన చేసుకోవాలి. తరువాత "ఒక్కో వాక్యం రాస్తూ ఇది ఫలానా కాండకు చెందినది" అని పూర్తి వాక్యంలో సమాధానం రాయాలి. దీనికై విద్యార్థులు రామాయణ కథను పూర్తిగా అర్థం చేసుకుంటూ కనీసం రెండు, మూడు పర్యాయాలు చదివి ఉండాలి. అప్పుడే ఇచ్చిన వాక్యాలు ఏ ఏ కాండలకు చెందినవో తేలికగా రాయగలరు.
4వ ప్రశ్నగా ఒక అపరిచిత గద్యం / లేఖ /కరపత్రం / ఏదేని వ్యవహార రూపం ఇచ్చి 4 ప్రశ్నలు అడుగుతారు. అందులో మూడింటికి ఇచ్చిన విషయంలోనే సమాధానాలుంటాయి. ఒక ప్రశ్నను విద్యార్థులు తయారు చేయాల్సి ఉంటుంది. ఇందుకు విద్యార్థులు గద్యాన్ని 3 లేదా 4 మార్లు నిదానంగా అర్థం చేసుకుంటూ చదివిన తర్వాతే ప్రశ్నలకు  అర్థవంతమైన సమాధానం పూర్తి వాక్యంలో రాస్తే అన్ని మార్కులూ సంపాదించవచ్చు.  ప్రశ్న తయారీకి సంబంధించి "ఇచ్చిన గద్యానికి ఒక పేరు పెట్టండి ? ఇచ్చిన గద్యంలోని అంశమేమిటి ? " వంటి ప్రశ్నలను విద్యార్థులు తయారు చేయవచ్చు.
 రెండవ విద్యా ప్రమాణమైన వ్యక్తీకరణ - సృజనాత్మకతలో మూడు ప్రశ్నలు లఘు సమాధానాలవి, మరో మూడు ప్రశ్నలు వ్యాసరూప సమాధానాలవి. ఒక్కో లఘు సమాధానానికి 4మార్కుల చొప్పున 12 మార్కులు. వ్యాసరూప సమాధానానికి 8 మార్కుల చొప్పున 24 మార్కులు. మొత్తం 36 మార్కులు.
ఇందులో 5వ ప్రశ్న కవి కాలాదులకు సంబంధించినది. దీనికోసం విద్యార్థులు పద్యపాఠ్యాంశాలలోని శతక మధురిమ పాఠ్యాంశాన్ని మినహాయించి మిగతా పాఠాల కవి కాలాదులను చదివితే సరిపోతుంది. ఇందులో ముఖ్యంగా కవి పేరుతో పాటు,  ఏవేని నాలుగు అంశాలను రాస్తే పూర్తి మార్కులు వస్తాయి. 
6వ ప్రశ్నగా గద్యభాగ పాఠ్యాంశాల ప్రక్రియలు, నేపథ్యాలను చదివితే ఏదో ఒకటి వస్తుంది. ముఖ్యంగా లేఖ, పీఠిక, కథానిక ప్రక్రియలు జానపదుని జాబు, చిత్రగ్రీవం, గోరంత దీపాలు నేపథ్యాలను చదివితే ఒకటి రాయవచ్చు. 
7వ ప్రశ్నగా రామాయణంలో పాఠ్యపుస్తకం చివరగా ఇచ్చిన పాత్రలను చదివి ఆయా పాత్రల 4 గుణాలను రాస్తే సరిపోతుంది. కథాంశం రాయకూడదు.
 8వ ప్రశ్న పద్య పాఠ్యాంశాల నుండి ఏవేని రెండు ప్రశ్నల్లో ఒకదానికి సమాధానం రాయమంటారు. దీనికోసం మాణిక్యవీణ, మాతృభావన, వెన్నెల, శతక మధురిమ పాఠ్యాంశాలలోని వ్యాస రూప సమాధాన ప్రశ్నలను చదివితే ఒక దానికి సమాధానం రాయవచ్చు. 
9వ ప్రశ్నగా రామాయణం నుండి అడిగిన ఏవేని రెండు ప్రశ్నలలో ఒకదానికి సమాధానం రాయాలి. దీనికోసం పాఠ్యపుస్తకంలో చివర ఇచ్చిన ప్రశ్నలను చదివితే రాయవచ్చు. 
10వ ప్రశ్నగా పద్య, గద్య పాఠ్యాంశాలలోని సృజనాత్మక ప్రశ్నలను చదవాల్సి ఉంటుంది. అందులో ముఖ్యంగా లేఖకు సంబంధించిన ప్రశ్నలను విద్యార్థులు తర్ఫీదు చేయాలి.
ఇవన్నీ ఎనిమిది మార్కుల ప్రశ్నలు. ఇక్కడ విద్యార్థులురాసే పదజాలానికి, వాక్య నిర్మాణానికి, విషయానికనుగుణంగా మార్కులుంటాయి. దోషరహితంగా రాసిన సమాధానాలకు ఎక్కువ మార్కులు వస్తాయి. భావ దోషాలు, భాషా దోషాలు లేకుండా విద్యార్థులు జాగ్రత్త వహిస్తే మంచి మార్కులు సాధించవచ్చు.
మూడవ విద్యా ప్రమాణమైన భాషాంశాలకు సంబంధించిన ప్రశ్నలన్నీ దాదాపుగా పాఠాలకు వెనుకనున్న, పాఠ్యపుస్తకం చివరగల అంశాలను తప్పనిసరిగా చదవాలి...
 ముఖ్యంగా  ఇచ్చిన వాక్యంలోగల అలంకారాన్ని గుర్తించి  రాయాలి. ఇక్కడ ఇచ్చిన వాక్యం రాస్తూ... ఇది ఫలానా అలంకారం అని అలంకారం పేరు రాయాలి. దీనికి 2 మార్కులు. ఇందు కోసం ముఖ్యంగా ఉపమా, యమక, శ్లేషాలంకారాలకు సంబంధించిన ఉదాహరణలను విద్యార్థులు తర్ఫీదు పొందాలి. 
చందస్సులో ఇచ్చిన పద్య పాదాన్ని మొదటగా తప్పు లేకుండా రాసుకోవాలి.  తరువాత గురు, లఘువులు గుర్తించి, గణవిభజనచేసి, ఏ పద్యపాదమో రాయాలి. లఘు గురువులు గుర్తించి, గణ విభజన చేసినందుకు 1మార్కు, పద్యం పేరు రాసినందుకు 1 మార్కు.
 అర్థాలు, పర్యాయ పదాలు, ప్రకృతి - వికృతులు, నానార్ధాలు, వ్యుత్పత్త్యర్థాలకు సంబంధించి ఒక్కో దానికి రెండేసి ప్రశ్నలుంటాయి. వాటిలో ఒక ప్రశ్నకు నేరుగా సమాధానం రాయాల్సి ఉండగా, మరో ప్రశ్నకు బహుళైచ్ఛిక సమాధానాలలో ఒకదాన్ని గుర్తించాల్సి ఉంటుంది. 
19, 20 ప్రశ్నలు జాతీయాలకు సంబంధించిన ప్రశ్నలు. ఇందులో ఇచ్చిన వాక్యంలోని జాతీయాన్ని గుర్తించి రాసినందుకు 2 మార్కులు ఇస్తారు. అడిగిన జాతీయం ఏ అర్థంలో, ఏ సందర్భంలో ఉపయోగిస్తారో రాసినందుకు 2 మార్కులు ఇస్తారు. 
ఒక సంధి పదాన్ని విడదీయడం, మరో పదాన్ని కలపడం, ఇంకో దానికి సంధి పేరును గుర్తించి రాయడం చేయాలి. 
సమాస పదానికి విగ్రహవాక్యం రాయడం, మరో పదానికి ఏ సమాసమో గుర్తించి రాయాలి. 
ఆధునిక వచనాన్ని బహుళైచ్ఛిక సమాధానాలలో గుర్తించి రాయాలి. 
ఇచ్చిన వ్యతిరేకార్థక వాక్యం మొదట ఏ కాలంలో ఉందో గుర్తించి అదే కాలంలోకి వ్యతిరేక వాక్యం రాయాలి. అంటే భూతకాలంలో ఉంటే భూతకాలంలోకి, వర్తమాన కాలంలో ఉంటే వర్తమానకాలంలోకి, భవిష్యత్తుకాలంలో ఉంటే భవిష్యత్తుకాలంలోకి వ్యతిరేకం రాయాలి. వ్యతిరేకార్థాన్నిచ్చే క్రియను గుర్తించి రాయమనే ప్రశ్నలో చూడక, చేయక, తినక... వంటి పదాన్ని గుర్తించి రాయాలి. 
28వ ప్రశ్నగా ఇచ్చినటువంటి వాక్యం ఏ రకమైన సంశ్లిష్ట వాక్యమో రాయమంటారు. ఇందులో ముఖ్యంగా క్త్వార్ధకం, శత్రర్థకం, చేదర్థకం, అప్యర్థకం అనే నాలుగు రకాలలో ఒకటి ఉంటుంది. 
29వ ప్రశ్నగా సరియైన కర్మణి వాక్యాన్ని గుర్తించమని బహుళైచ్ఛిక ప్రశ్నగా అడుగుతారు. ఇక్కడ విద్యార్థులు కర్తరి - కర్మణి వాక్యాలకు సంబంధించిన నియమాలను క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకున్న మీదటే వీటికి సమాధానాలను గుర్తించగలరు. 
చివరగా ఇచ్చిన వాక్యాలు ఏ రకమైన సామాన్య వాక్యాలో రాయమని,  గుర్తించమని అడుగుతారు. ఇందులో సంశ్లిష్ట వాక్య రకాలైన క్త్వార్థకం, శత్రర్థకం, చేదర్థకం, అప్యర్థక వాక్యాలనుంచి ప్రశ్నలు అడగరు. 
సామాన్య వాక్యాల్లోని ప్రశ్నార్థక వాక్యం, సామర్ధ్యార్థక వాక్యం, ఆశ్చర్యార్థక వాక్యం, విధ్యర్థకవాక్యం, ఆశీరర్థక వాక్యం మొదలగునవి అడుగుతారు.
 విద్యార్థులకు సూచన :
భాషాంశాలకు సంబంధించిన ప్రశ్నల్లో గుర్తించండి... అని అడిగే ప్రశ్నలకు నాలుగు సమాధానాలు ఉంటాయని, అందులో ఒకటి జవాబుగా గుర్తించమని అర్థం. రాయండి అని అడిగే ప్రశ్నలకు విద్యార్థి తాను చదువుకున్న, నేర్చుకున్న విషయ పరిజ్ఞానాన్ని బట్టి సమాధానాలు రాయాల్సి ఉంటుంది.
   ఆందోళన చెందకుండా, అతివిశ్వాసం లేకుండా, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే...  అమ్మ భాష తెలుగులో అత్యధిక మార్కులు సంపాదించడం తేలికే...
విద్యార్థులు విజయీ భవ..
1st Language Paper-1  (Composite Telugu) 03T CLICK HERE
1st Language Paper-2 (Composite Sanskrit) 04S CLICK HERE
10TH CLASS TELUGU (FL) MODEL PAPER CLICK HERE
WEEKLY TEST PAPERS CLICK HERE
GRAND TEST PAPERS CLICK HERE
MINI ASSIGNMENTS-7 CLICK HERE
SLIP TEST PAPERS-30 CLICK HERE 
SLIP TEST PAPERS -20 CLICK HERE
TELUGU COMPOSITE LANGUAGE MINI ASSIGNMENTS-8
తెలుగు పదోతరగతి ముఖ్యాంశాలు.
TELUGU STUDY MATERIAL  2023-24 (PAPER ANALASYS) CLICK HERE
TELUGU STUDY MATERIAL FOR GRADE "C" AND GRADE "D" STUDENTS