Income Tax Return Filing 2024: ఆర్థిక సంవత్సరం 2023-24 కోసం ఆదాయ పన్ను రిటర్న్‌లు జోరుగా దాఖలవుతున్నాయి. ఈ ఏడాది ఫైలింగ్ సీజన్ ప్రారంభమైన తర్వాత, ఇప్పటివరకు 10 లక్షలకు పైగా రిటర్నులు దాఖలయ్యాయి. ITR సమర్పించేందుకు 31 జులై 2024 వరకు సమయం ఉంది.
ఈ సంవత్సరం, పన్ను చెల్లింపుదార్లకు మరింత వెసులుబాటు కల్పించేలా, AISకు సంబంధించి, ఆదాయ పన్ను విభాగం పెద్ద మార్పు తీసుకువచ్చింది.
AIS అంటే ఏమిటి?
AIS అంటే వార్షిక సమాచార ప్రకటన (Annual Information Statement). పన్ను చెల్లింపుదార్లకు సంబంధించిన చాలా సమస్యలు పరిష్కరించగల డాక్యుమెంట్ ఇది. ఈ పత్రంలో, ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక వ్యక్తి సంపాదించిన మొత్తం ఆదాయ వివరాలు ఉంటాయి. కొన్నిసార్లు, పన్ను చెల్లింపుదారుకు తెలీకుండానే మరికొన్ని మార్గాల నుంచి ఆదాయం వస్తుంది. ఉదాహరణకు సేవింగ్స్ అకౌంట్ మీద వడ్డీ ఆదాయం. ఆదాయ పన్ను రిటర్న్ దాఖలు చేయడానికి ముందు AISని క్రాస్ చెక్ చేస్తే, రిటర్న్‌లో తప్పులు చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.
పన్ను విధించదగిన మొత్తం ఆదాయం గురించిన మొత్తం సమాచారం AISలో కనిపిస్తుంది. జీతం కాకుండా ఇతర మూలాల నుంచి వచ్చిన ప్రతి ఆదాయ వివరం ఇందులో ఉంటుంది. దీంతోపాటు TIS (Taxpayer Information Summary) అనే మరో డాక్యుమెంట్ కూడా ఉంటుంది. ప్రాథమికంగా AIS సారాంశమంతా TISలో ఉంటుంది.
AISలో వచ్చిన మార్పు ఏంటి?
పన్ను చెల్లింపు వ్యవస్థను పారదర్శకంగా మార్చడానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) వార్షిక సమాచార ప్రకటనలో కొత్త ఫంక్షన్‌ను జోడించింది. దీనివల్ల, పన్ను చెల్లింపుదార్లు AISలో కనిపించే ప్రతి లావాదేవీపై తమ అభిప్రాయాన్ని తెలియజేయవచ్చు, స్టేటస్‌ను చెక్ చేయవచ్చు. ఇప్పటివరకు, పన్ను చెల్లింపుదారు ఫీడ్‌బ్యాక్ ఇచ్చే సౌకర్యం మాత్రమే ఉండేది.
AISలో వచ్చిన మార్పు వల్ల ఉపయోగం ఏంటి?
కొత్త మార్పు గురించి మరింత వివరంగా చెప్పుకుందాం. పన్ను చెల్లింపుదారు AISలోని ఏదైనా లావాదేవీ విషయంలో పొరపాటు/ లోపాన్ని కనుగొంటే, గతంలో అతను ఫీడ్‌బ్యాక్ మాత్రమే ఇవ్వగలిగేవాడు. ఆ ఫీడ్‌బ్యాక్‌పై అవతలి పక్షం ఎలాంటి చర్య తీసుకుందో టాక్స్‌పేయర్‌కు అర్ధమయ్యేది కాదు. ఇప్పుడు, పన్ను చెల్లింపుదారు తన ఫీడ్‌బ్యాక్ మీద అవతలి పక్షం స్పందనను (స్టేటస్) చూడడంతో పాటు, ఎలాంటి చర్య తీసుకున్నారో తెలుసుకునే అవకాశం కూడా లభిస్తుంది. ఫలితంగా, ఒకవేళ AISలో ఏదైనా తప్పు దొర్లితే సరిదిద్దవచ్చు. ఈ ప్రక్రియపై రియల్ టైమ్ అప్‌డేట్స్ కూడా పొందుతారు. దీనివల్ల, ఆదాయ పన్ను విభాగం - పన్ను చెల్లింపుదారుల మధ్య పారదర్శకత పెరుగుతుంది. వివాదాలు, కోర్టు కేసులు తగ్గుతాయి.
AISని ఎలా చూడాలి/ డౌన్‌లోడ్ చేయాలి?
ఆదాయ పన్ను ఫైలింగ్ పోర్టల్ www.incometax.gov.in లోకి వెళ్లండి.
యూజర్ ఐడీ (PAN), పాస్‌వర్డ్ ఉపయోగించి లాగిన్ అవ్వండి.
అప్పర్ మెనులో సర్వీసెస్ ట్యాబ్ మీద క్లిక్ చేయండి.
డ్రాప్‌డౌన్ మెను ఓపెన్ అవుతుంది. అందులో, 'యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్' (AIS) ఎంచుకోండి.
ప్రొసీడ్‌పై క్లిక్ చేసిన వెంటనే మరో విండో ఓపెన్ అవుతుంది.
కొత్త విండో పేజీలో AIS ఆప్షన్ ఎంచుకోండి.
ఇక్కడ, AISను డౌన్‌లోడ్ చేసుకునే ఆప్షన్ కూడా కనిపిస్తుంది.
AISని PDF లేదా JSON ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.